మంగళగిరి/పాడేరు:అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గిరిజనుల ఆదాయ వనరులు పెంచేందుకు అటవీ ఉత్పత్తులు, ఉద్యాన పంటలు, ఎకో టూరిజం, పర్యాటకం, మార్కెటింగ్ రంగాలపై దృష్టి సారిస్తూ పకడ్బందీ అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలని స్పష్టం చేశారు.
శనివారం ఆయన మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్, ఎస్పీ శ్రీ అమిత్ బర్దర్‌లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో గతంలో అల్లూరి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన, ప్రస్తుతం చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న శ్రీ సుమిత్ కుమార్, అలాగే గతంలో అల్లూరి జిల్లా ఎస్పీగా సేవలందించి ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న శ్రీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న అభివృద్ధి పనులు, గంజాయి నిర్మూలన అంశాలపై కూడా చర్చించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రపంచం వేగంగా మారుతోందని, ఆ మార్పులను గిరిజన ప్రాంతాలు కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల శక్తి, శ్రమను సమర్థంగా వినియోగించి వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలని తెలిపారు. అటవీ ఉత్పత్తులు, ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌కు విస్తృతమైన మార్కెట్ డిమాండ్ ఉందని పేర్కొన్న ఆయన, కాఫీ తోటలతో పాటు అడవుల్లో లభించే ఉత్పత్తులను సాగు చేసి మార్కెటింగ్ చేసేలా ప్రోత్సహించాలన్నారు.
గిరిజనులతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారాలు అందించాలని అధికారులకు సూచించారు. యువతలో నిరుద్యోగ సమస్య లేకుండా చేసేందుకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను అందుబాటులోకి తీసుకువచ్చి వారిని ఎంట్రప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దాలని అన్నారు.
ఉద్యాన పంటలకు ఉపాధి హామీ అనుసంధానం
ఏజెన్సీ ప్రాంతం ఉద్యాన పంటలకు అనువైనదని, దీన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానిస్తే గణనీయమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచడంతో పాటు అనుబంధ పనులను ఉపాధి పనులుగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీని ద్వారా గిరిజనులకు ఉపాధి లభించడమే కాకుండా అటవీ ఉత్పత్తుల పెంపుదలకూ దోహదం చేస్తుందని అన్నారు.
ప్రకృతిని కాపాడుతూ ఎకో టూరిజం
ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి విస్తారమైన అవకాశాలున్నాయని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా ఎదుగుతున్న రంగమైన ఎకో టూరిజాన్ని ప్రకృతికి హాని కలగకుండా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. టూరిజం ద్వారా వచ్చే లాభాలు, పర్యాటకులకు వసతి కల్పించి ఆదాయం పొందే మార్గాలపై గిరిజన యువతకు అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.
సినిమాలు, సీరియళ్లతో పాటు ఓటీటీ కంటెంట్ షూటింగ్‌లను ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రోత్సహించాలని ఆయన తెలిపారు. దీని ద్వారా గిరిజనులకు అదనపు ఆదాయం, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం సమీక్షిస్తూ, నెలవారీ నివేదికలతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. సమన్వయంతో పనిచేస్తే గిరిజనుల జీవితాల్లో తప్పకుండా మార్పు వస్తుందని పేర్కొంటూ, ఇందుకు తగిన పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేయాలని, ప్రభుత్వ పూర్తి సహకారం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
