విజయనగరం, మార్చి 11: రాష్ట్రం లో 500 చదరపు మీటర్లు లేదా 8 అపార్ట్మెంట్ కంటే ఎక్కువగా కలిగిన ప్రతి హోసింగ్ ప్రోజెక్ట్ ఎ పి రెరా అథారిటీ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏపీ రెరా చైర్మన్ ఆర్. ఎస్.శివారెడ్డి తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, బాధ్యత మరియు వినియోగదారుల హక్కుల పరిరక్షణను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (APRERA) ఆధ్వర్యంలో రెరా చట్టం, 2016 నిబంధనలు, వాటి అమలు విధానం పై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం ఉదయం హోటల్ ఎస్విఎన్ లేక్ ప్యాలస్ లోనిర్వహించారు.
అవగాహన సదస్సు కు విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలకు చెందిన రియల్ ఎస్టేట్ రంగ ప్రమోటర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది మరియు గృహ కొనుగోలుదారులు హాజరయ్యారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ఏపీ రెరా చైర్మన్ ఆర్. ఎస్. శివారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగం తరువాత అత్యధిక ప్రాధాన్యత కలిగిన ఆర్ధిక రంగం నిర్మాణరంగమని తెలిపారు. నిర్మాణదారులకు, కొనుగోలుదారులకు ఇబ్బందులు రాకుండా, కొనుగోలుదారుల సంక్షేమమే అంతిమలక్ష్యంగా రేరా అథారిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అయన తెలిపారు. రేరా చట్టం పై ప్రజలకు, నిర్మాణదారులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా 13 పాత జిల్లాలలో అవగాహన కార్యక్రమంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పురోగతిలో నిర్మాణరంగం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. నిర్మాణరంగం అభివృద్ధికి, కొనుగోలుదారుల రక్షణ, సంక్షేమానికి రెరా చట్టం రూపొందించడం జరిగిందని అన్నారు. 500 చదరపు మీటర్లు విస్తీర్ణం లేదా ఎనిమిది అపార్ట్మెంట్లు పైబడిన ప్రతి ప్రాజెక్టు రేరా అథారిటీ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.
రేరా వద్ద రిజిస్ట్రేషన్ పొందని ప్రాజెక్టులపై ప్రాజెక్ట్ వ్యయంలో పది శాతం అపరాధం రుసుము విధించనున్నట్లు తెలిపారు. ఇప్పుడు వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోని ప్రాజెక్టులకు మార్చి 31 వరకు యాబది శాతం అపరాధ రుసుము సబ్సిడీతో రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించడం జరిగిందని, కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
నిర్మాణ రంగంలో వచ్చే సమస్యలు, ఫిర్యాదులు రేరా అథారిటీ ద్వారా మాత్రమే పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. నిర్మాణదారులు తాము చేపడుతున్న ప్రాజెక్టులలో వాస్తవంగా కల్పిస్తున్న సౌకర్యాలను మాత్రమే వినియోగదారులకు తెలియజేయాలని, అగ్రిమెంట్లో పొందుపరచుకోవాలని తెలిపారు.
అగ్రిమెంట్లో పొందుపరిచిన విధంగా ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా, వసతులు కల్పించకపోయిన పోయినా ఫిర్యాదుల మేరకు రేరా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రెరా చట్టంపై నిర్మాణదారులు, కొనుగోలుదారులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రాజెక్టులు చేపట్టుటకు రిజిస్ట్రేషన్, త్రైమాసిక నివేదికలు సమర్పణ, ప్రాజెక్టు పూర్తయిన పిదప అపార్ట్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి వారికి అప్పగించడం ద్వారా రేరా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం జరుగుతుందన్నారు. అపార్ట్మెంట్ అప్పగించిన ఐదు సంవత్సరాల వరకు ఒప్పందం అమలులో ఉంటుందని తెలిపారు. 10 శాతం మార్టిగేజ్ స్థలం విడిపించుకోవాలన్నా, ప్రాజెక్టుకు బ్యాంకు రుణం పొందాలన్నా రేరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తెలిపారు.
ఈ సందర్భంగా చైర్మన్ తో పాటు రెరా అసిస్టెంట్ డైరెక్టర్ జివిజిఎస్ వరప్రసాద్, సభ్యులు రాజశేఖర్ రెడ్డి, కామేశ్వరరావు, శివారెడ్డి, వెంకటరత్నం, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, జె. కులదీప్ రెరా చట్టం–2016లోని ముఖ్య నిబంధనలు, ప్రాజెక్టుల నమోదు విధానం, సమయపాలన, ఆర్థిక పారదర్శకత, వినియోగదారుల హక్కులు మరియు బాధ్యతలు తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు. ప్రతినిధుల సందేహాలకు సమాధానాలు తెలిపారు.
