కశింకోటలో గంజాయి అక్రమ రవాణాకు చెక్

Kasimkota police station
Kasimkota police station

పోలీసుల మెరుపు దాడిలో 14 కిలోల గంజాయి స్వాధీనం – ఇద్దరు నిందితుల అరెస్ట్

అనకాపల్లి (కశింకోట), జనవరి 29 – జన కమలం న్యూస్:
జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టే దిశగా అనకాపల్లి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్., అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీమతి ఎం.శ్రావణి ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక దాడుల్లో కీలక విజయం సాధించారు.
కశింకోట సీఐ ఏ. స్వామి నాయుడు గారికి అందిన ముందస్తు సమాచారం ఆధారంగా, కశింకోట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
ఈ రోజు ఉదయం కశింకోట సీఐ గారి మార్గదర్శకత్వంలో ఎస్సై పి. మనోజ్ కుమార్, సిబ్బంది బి. మహేశ్వరరావు, వై. లక్ష్మణ రావు, ఎల్. రాజశేఖర్ మరియు రెవెన్యూ అధికారులు విఆర్ఓ పొత్తుల శ్రీనివాసరావు, విఆర్ఏ సూరి అప్పారావు కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించారు. పోలీసులను గమనించి పరారయ్యే ప్రయత్నం చేసిన ఇద్దరు యువకులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వివరాలు:
🔹 గంటాల యశ్వంత్ (26) – శ్రీకాకుళం జిల్లా
🔹 చిలకచర్ల నవీన్ (22) – గూడూరు మండలం, నెల్లూరు జిల్లా
వారి వద్ద ఉన్న ట్రాలీ బ్యాగ్, బ్యాక్‌ప్యాక్‌లను తనిఖీ చేయగా 7 ప్యాకెట్లలో ఉన్న 14 కిలోల గంజాయి లభ్యమైంది. దీని అంచనా మార్కెట్ విలువ సుమారు రూ.70,000/-గా పోలీసులు నిర్ధారించారు.
విచారణలో నిందితులు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు ప్రాంతం నుండి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి, నెల్లూరు జిల్లా వైపు తరలిస్తున్నట్లు అంగీకరించారు. నిందితులపై NDPS చట్టం ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ అక్రమ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఇతరుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ,
“గంజాయి రవాణా చేసినా, విక్రయించినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి” అని హెచ్చరించారు.