Posted in

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై కఠిన చర్యలు – జిల్లాలో 40 సిలిండర్లు స్వాధీనం

Civil supplies department
Civil supplies department

విజయనగరం, మార్చ్ 11:జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్న వారిపై పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఢాబాలు మరియు ఇతర వాణిజ్య కేంద్రాలలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి జి. మురళినాధ్ తెలిపారు.

డిప్యూటీ తహసీల్దార్లు తమ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి కమర్షియల్ సిలిండర్లకు బదులుగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నట్లు గుర్తించిన పక్షంలో సంబంధిత యజమానులపై 6A కేసులు నమోదు చేసి సిలిండర్లను స్వాధీనం చేసుకుంటున్నట్లు వెల్లడించారు.

గత ఆరు నెలల కాలంలో జిల్లాలో మొత్తం పది 6A కేసులు నమోదు చేసి 40 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. డొమెస్టిక్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.

ఈ మేరకు సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఢాబాలు మరియు ఇతర వ్యాపార కేంద్రాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్లు ఎ. రామారావు, ఎన్.వి.వి.ఎస్. మూర్తి, ఆర్. శంకరరావు, ఎస్. చిరంజీవిరావు తమ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 6A కేసులు నమోదు చేసి నివేదికలను కార్యాలయానికి సమర్పించాలని సూచించినట్లు చెప్పారు.

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగం, అక్రమ రీఫిల్లింగ్ వంటి చర్యలను పూర్తిగా అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తోందని జిల్లా పౌర సరఫరాల అధికారి జి. మురళినాధ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *