Posted in

అరకు గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలకు ‘సంజీవని’.. రాష్ట్రవ్యాప్తంగా గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు

AP CM CHANDRABABU NAIDU
AP CM CHANDRABABU NAIDU

అల్లూరి జిల్లా, ఆగస్టు 29: మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ‘సంజీవని’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అల్లూరి జిల్లా అరకు లోయ నియోజకవర్గంలోని గన్నెలిలో నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

కొండ ప్రాంతాల్లోని ప్రజలు వైద్య సేవల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండకూడదన్నదే తన సంకల్పమని సీఎం చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి రోగుల రక్త నమూనాలను డ్రోన్ల ద్వారా పెద్ద ఆస్పత్రులకు తరలించి పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 104 వాహనాల ద్వారా మొబైల్ వైద్య సేవలు అందించడంతో పాటు గర్భిణులకు తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా సేవలు అందిస్తున్నామని వివరించారు.

ఇప్పటికే కుప్పం నియోజకవర్గం, చిత్తూరు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తున్నామని, ఇది రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ గేమ్ చేంజర్‌గా మారుతుందని చంద్రబాబు అన్నారు. గిరిజనులతో పాటు రాష్ట్రంలోని ప్రతి పౌరుడి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

గిరిజన ప్రాంతాల్లో ఏ కుటుంబమూ పేదరికంలో ఉండకూడదన్నదే ప్రభుత్వ ఆలోచన అని సీఎం తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా గతంలో జీఓ నంబర్ 3 తీసుకొచ్చామని, అయితే గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా సుప్రీంకోర్టు దానిని రద్దు చేసిందని పేర్కొన్నారు. ఈ అంశంపై అందరికీ ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయాన్ని త్వరలో తీసుకువస్తామని చెప్పారు.గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఐదు సూత్రాలతో ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.

‘అడవితల్లి బాట’ పేరుతో రూ.1,000 కోట్లతో 900 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించామని చెప్పారు. 1.60 లక్షల ఇళ్లకు కుళాయి ద్వారా తాగునీరు అందించడంతో పాటు సోలార్ రూఫ్‌టాప్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

అరకు కాఫీ, పర్యాటకంతో గిరిజనులకు ఉపాధి

గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచేందుకు అరకు కాఫీ సాగును మరో లక్ష ఎకరాలకు విస్తరించేలా ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

అరకు ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని, హోమ్‌స్టేల ద్వారా పర్యాటకులకు ఆతిథ్యం అందిస్తే గిరిజన కుటుంబాలకు అదనపు ఆదాయం లభిస్తుందని చెప్పారు.ప్రాంతానికి వచ్చే పరిశ్రమల్లో గిరిజన యువతకు ఉద్యోగాలు లభించేలా నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తామని, వచ్చే మూడేళ్లలో లక్ష మంది యువతకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

రూ.250 కోట్లతో ట్రైబల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్

గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య మౌలిక వసతుల కోసం రూ.250 కోట్లతో ‘ట్రైబల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీషన్ మిషన్’ తీసుకురానున్నట్లు సీఎం ప్రకటించారు. అత్యవసర వైద్య సేవల కోసం జిల్లాలో 150 వాహనాలతో ఎమర్జెన్సీ లైఫ్‌లైన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేశామని చెప్పారు.


సికిల్ సెల్, తలసేమియా బాధితులకు నెలకు రూ.10,000 పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. గిరిజన పిల్లలు దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో చదవాలన్న లక్ష్యంతో ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం చేసుకున్నామని, IIT, NEET వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందిస్తున్నామని చెప్పారు.


గిరిజన రైతులు తమ ఉత్పత్తులతో ప్రపంచ స్థాయి బ్రాండ్‌ను సృష్టించే స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. ప్రతి గిరిజన కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగుపడటమే నిజమైన అభివృద్ధి అని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *