గజపతినగరం, దత్తి, అక్టోబర్ 1: ఒకటో తేదీన పింఛన్ల పంపిణీతో గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పండుగను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లా గజపతి నియోజకవర్గం దత్తి గ్రామంలో సీఎం పర్యటించారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్లు అందించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పొంతూరు అప్పలరాజుకు, ఆయన తల్లికి పింఛను అందజేశారు. అనంతరం ప్రభుత్వ పథకాల అమలు తీరుపై వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఒకప్పుడు పండుగ చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉండేదని ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ప్రతి నెలా పండుగ వస్తోందని సీఎం అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత నేటితో కలిపి 16 నెలల్లో రూ.48,019 కోట్లు పింఛన్లపై ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం మనదే. రాష్ట్రవ్యాప్తంగా 50,765 మందికి రూ.2,745 కోట్లు పింఛన్లు కింద పంపిణీ చేస్తున్నాం. వృద్ధాప్య పింఛనుదారు చనిపోతే అతని భార్యకువెంటనే వితంతు పింఛన్ మంజూరు చేస్తున్నాం. ఈ నెలలో కొత్తగా 10,578 మందికి రూ.4.23 కోట్లు వితంతు పింఛన్లు ఇస్తున్నాం. 2 నెలలు పెన్షన్ తీసుకోని 1,34,023 మందికి రూ.108 కోట్లు, 3 నెలలుగా పింఛన్లు తీసుకోని 11,545 మందికి రూ.14 కోట్లు విడుదల చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.
పేదలకు న్యాయం చేయడమే ధ్యేయం
గత ప్రభుత్వంలో ఒకటి రెండు నెలలు పింఛను తీసుకోకపోతే కట్ చేసేవాళ్లని, ప్రజా ప్రభుత్వంలో పేదలకు న్యాయం చేయాలనే ఏకైక ధ్యేయంతో రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా మూడో నెల ఇస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. లబ్ధిదారులు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి పింఛను అందిస్తున్నాం. ఒక్క విజయనగరం జిల్లాలోనే ప్రతీ నెలా 2,75,682 మందికి రూ.117 కోట్లు పింఛన్లు రూపంలో ఇస్తున్నాం. గజపతినగరం నియోజకవర్గంలో 39,641 మందికి రూ.17 కోట్లు అందిస్తున్నాం. దత్తి గ్రామంలో 706 మందికి నెలకు రూ.29 లక్షలు పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నాం. ఎన్టీఆర్ 1985లో రూ. 30తో పింఛను పథకాన్ని ప్రారంభించారు. నేను 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు దాన్ని రూ. 75 చేశాను. 2014లో రూ. 1000 , ఆపై 2000 వేలకు పెంచానని ముఖ్యమంత్రి అన్నారు.
మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశాం
సూపర్ సిక్స్ పథకాల అమల్లో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామని ముఖ్యమంత్రీ చంద్రబాబు తెలిపారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తున్నాం. ఇందుకోసం రూ.10,090 కోట్లు … 63.77 లక్షల మంది విద్యార్ధుల తల్లులకు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశాం. ఆడబిడ్డలకు వంటింటి కష్టాలు తీర్చాలని దీపం పథకాన్ని అమలు చేస్తున్నాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. పథకం వల్ల ఏడాదిలో కోటికి పైగా కుటుంబాలు ప్రయోజనం పొందాయి. 2.66 కోట్ల సిలిండర్లు సబ్సిడీపై అందించాం. దీనికి రూ.1,718 కోట్లు ఖర్చు పెట్టాం. స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్ట్ 15న ప్రారంభిస్తే 45 రోజుల్లోనే దగ్గర దగ్గరగా మహిళలు10 కోట్ల ప్రయాణాలు చేయడం నాకు ఆనందంగా ఉంది. ఈ పండుగ సీజన్ లో అన్ని దేవాలయాల్లో మహిళా భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. పథకం అమల్లో భాగంగా నెలకు రూ.247 కోట్లు, ఏడాదికి రూ.2,963 కోట్లు స్త్రీ శక్తి కోసం ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
శ్రీవారి ఆశీస్సులతో ముందుకునాపై 24 క్లైమోర్ మైన్స్ పేల్చితే… సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామియే నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఆ స్వామి ఆశీస్సులతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తాను. ఆనాడు ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని దేవాలయాల్లోనూ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రాణదానం ట్రస్ట్ కింద రూ. 688 కోట్ల నిధులను సమీకరించి తిరుపతిలో ఉండే ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం. రాష్ట్రంలో 17 లక్షల శ్రీవారి సేవకులు ఉన్నారు. బ్రహ్మోత్సవాలుe విజయవంతంగా జరుగుతున్నాయంటే అందులో సేవకుల కృషి కూడా ఉంది. విదేశాల్లో ఉంటున్న మన తెలుగు డాక్టర్లు ఓ వారం రోజులు తిరుపతిలో పేదలకు వైద్యం చేసి శ్రీవారి దర్శనం చేసుకోమని నేను పిలుపునిచ్చాను. దేశవ్యాప్తంగా 5 వేల శ్రీవారి ఆలయాలను నిర్మిస్తున్నాం. అలాగే మసీదులు, చర్చిలు కట్టుకోవడానికి ప్రభుత్వపరంగా నిధులు మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
దేశంలో అధిక పింఛన్లు ఇచ్చే రాష్ట్రం ఏపీనే
మనదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో పింఛను ఇవ్వడంలేదని ముఖ్యమంత్రి అన్నారు. పింఛన్ల పంపిణీ బాధ్యతగా చేపట్టాం. మానవత్వంలో ఆలోచిస్తున్నాం. రూ.4,000 నుంచి రూ.15,000 వరకు పెన్షన్లు ఇస్తున్నాం. పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి నెలా ఒక జిల్లాకు వచ్చి స్వయంగా పింఛను పంపిణీ చేస్తున్నాను. ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రం కూడా పెన్షన్ల కోసం ఏడాదికి ఖర్చు చేస్తుంది కేవలం రూ.5,160 కోట్లుమాత్రమే. తెలంగాణలో ఏడాదికి రూ.8,179 కోట్లు ఇస్తుంటే మన రాష్ట్రంలో ఏడాదికి రూ.32,143 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నెలనెలా పెన్షన్ తీసుకుంటున్న వారిలో 59 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు పింఛన్ల కోసం 16 నెలల్లో ఖర్చు చేసిన రూ.48,019 కోట్లలో రూ.28,331 కోట్లు మహిళలకు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు.
