Posted in

గంజాయి అక్రమ రవాణా కేసులో నలుగురికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష – అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడి

Anakapalli district SP Tuhin Sinha
Anakapalli district SP Tuhin Sinha

అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా వెల్లడించిన వివరాల ప్రకారం, గంజాయి అక్రమ రవాణా కేసులో చోడవరం కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 80 కిలోల గంజాయిని అక్రమంగా తరలించిన నలుగురు నిందితులకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1 లక్ష జరిమానా విధిస్తూ తొమ్మిదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. హరినారాయణ తీర్పు ప్రకటించారు.

2017 జనవరి 8వ తేదీ ఉదయం కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని దొండపూడి చెక్ గేట్ వద్ద, రెండు మోటార్ సైకిళ్లపై గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. వారి వద్ద నుంచి మొత్తం 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ఈ కేసును అప్పటి దర్యాప్తు అధికారి ఎస్సై డి. శేఖరం లోతుగా దర్యాప్తు చేసి, పక్కా ఆధారాలతో కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారని ఎస్పీ తెలిపారు. విచారణ అనంతరం నిందితులపై మోపబడిన నేరం పూర్తిగా రుజువుకావడంతో కోర్టు కఠిన శిక్ష విధించిందన్నారు.
ఈ కేసులో శిక్ష అనుభవించాల్సిన నిందితులు పెంట శ్రీనివాసరావు (A1), వలబుల నూకరాజు @ చిన్నబ్బాయి (A3), సుర్ల రమణ (A4), కర్రి రామారావు (A5) అని ఎస్పీ వెల్లడించారు. ప్రతి నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,00,000 జరిమానా విధించగా, జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా కేసును సమర్థవంతంగా వాదించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీపురపల్లి సూర్యనారాయణ , అలాగే కేసును పకడ్బందీగా దర్యాప్తు చేసిన కొత్తకోట పోలీస్ సిబ్బందిని మరియు కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బందిని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేకంగా అభినందించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *