Posted in

బొండపల్లి మండలంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేసిన – మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Minister kondapalli srinivas
Minister kondapalli srinivas

విజయనగరం, జనవరి 3: రీసర్వే పూర్తయిన గ్రామాలలో రైతులకు ప్రభుత్వ రాజముద్ర తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తోందని రాష్ట్ర చిన్న సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలు, ఎన్ ఆర్ ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

            శనివారం బొండపల్లి మండలం మరువాడ గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి  మాట్లాడుతూ, రైతుల భూ హక్కులు స్పష్టంగా నమోదై, భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఉండేలా ఈ విధానం రూపకల్పన చేశామన్నారు.

రైతులు తమ భూమి వివరాలను సులభంగా తెలుసుకునే విధంగా క్యూ ఆర్ కోడ్ కలిగిన ఆధునిక పాస్ పుస్తకాలు ప్రభుత్వ రాజముద్రతో  అందిస్తున్నామని చెప్పారు.

భూ రికార్డులలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే, వాటిని రిజెక్ట్ చేయకుండా సరిదిద్దుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. జాయింట్ ఎల్పీఎం, ఈ-కేవైసీ, బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ భూములు రీ సర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించి పారదర్శకంగా, లోపాల సవరణతో పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.  జిల్లా వ్యాప్తంగా రీసర్వే పూర్తయిన గ్రామాలలో రోజువారీ లక్ష్యానికి అనుగుణంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

గ్రామ సభల ద్వారా ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేసుకుని పంపిణీ జరుగుతోందన్నారు.

రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, మ్యూటేషన్ సమస్యలు, సరిహద్దు వివాదాలను సత్వర పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.

ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా పర్యవేక్షణ పెంచామని, తప్పుడు సమాచారంతో పాస్ పుస్తకాలు పొందే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రైతులు తమ సమస్యలను సంబంధిత రెవెన్యూ అధికారులను లేదా మండల స్థాయి కార్యాలయాలను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

            గ్రామ సభలో భాగంగా పలువురు రైతులకు మంత్రివర్యులు కలెక్టర్ చేతుల మీదుగా పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి డి కీర్తి, ఎంపీపీ చల్లమనాయుడు, సర్పంచులు డి పార్వతి, బి రాము, శ్రీనివాస్, ఈ కృష్ణ తదితర  ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *