Posted in

అంగన్వాడీ కార్యకర్తలకు 5 జి మొబైల్స్ పంపిణీ

Mustabu program vizianagaram
Mustabu program vizianagaram

జిల్లాలో ‘ముస్తాబు’ కార్యక్రమం ప్రారంభం

విజయనగరం, డిసెంబర్ 22 :    చిన్నారుల‌కు, గ‌ర్బిణుల‌కు, బాలింత‌ల‌కు అంగ‌న్వాడీ కార్య‌క‌ర్త‌లు చేస్తున్న‌ సేవ‌లు వెలక‌ట్ట‌లేనివ‌ని ఉపాధ్యాయ ఎంఎల్‌సి గాదె శ్రీ‌నువాసుల‌నాయుడు కొనియాడారు. స్త్రీశక్తికి ప్ర‌తిరూపంగా వారు త‌మ విధుల్లో మ‌న‌సుపెట్టి ప‌నిచేస్తున్నార‌ని పేర్కొన్నారు. బేటి బ‌చావో-బేటి ప‌డావో కార్య‌క్ర‌మంలో భాగంగా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్య‌క్ర‌మాల‌ను క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో సోమ‌వారం ప్రారంభించారు. బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో  చేపట్టిన ‘100 రోజుల జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా 2499 అంగన్వాడీ కేంద్రాల్లో ముస్తాబు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేదికపై జిల్లాలోని 169 మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు అందజేశారు. అదేవిధంగా, అంగన్‌వాడీ సేవలను మరింత బలోపేతం చేసేందుకు మరియు డిజిటల్ రిపోర్టింగ్‌ను వేగవంతం చేసేందుకు మొత్తం 2608 మంది అంగన్వాడి కార్యకర్తలకు అత్యాధునిక 5జి మొబైల్ ఫోన్లు మంజూరు కాగా, తొలివిడ‌త‌గా 500 ఫోన్ల‌ను ఈ కార్య‌క్ర‌మంలో పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజ‌రైన‌ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు మాట్లాడుతూ గ‌ర్భిణులు, బాలింత‌ల‌ను అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లు అన్నీ తామై అక్కున చేర్చుకుంటున్నార‌ని అభినందించారు. త‌మ‌వ‌ద్ద‌నున్న చిన్నారుల‌ను ఉత్త‌మ పౌరులుగా తీర్చిదిద్దే గురుత‌ర బాధ్య‌త అంగ‌న్వాడీ కార్య‌క‌ర్త‌ల‌పై ఉంద‌న్నారు. వారే విద్యార్దుల‌కు తొలిగురువులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పారు. ముస్తాబు కార్య‌క్ర‌మం ద్వారా విద్యార్ధుల‌కు క్ర‌మ‌శిక్ష‌ణ‌, వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌ను అల‌వాటు చేసి, వారిని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చేర్పించేందుకు కృషి చేయాల‌ని కోరారు. కార్య‌క‌ర్త‌ల పేరును అంగ‌న్‌వాడీ టీచ‌ర్లుగా మార్చేందుకు, వారి జీతాల‌ను పెంచేందుకు, డీఎస్సీలో వెయిటెజ్ మార్కులు ఇచ్చేందుకు త‌మ‌వంతు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

మ‌రో ముఖ్య అతిధి, ఎంఎల్‌సి ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ, బాల్య వివాహాలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పని చేయాలని, ముఖ్యంగా అంగన్‌వాడీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. చిన్న‌ పిల్ల‌ల‌కు అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లే ఆద‌ర్శ‌మ‌ని, క్ర‌మ‌శిక్ష‌ణ‌, వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌, చ‌క్క‌గా త‌యార‌వ్వ‌డం ద్వారా వారికి స్ఫూర్తిగా నిల‌వాల‌ని సూచించారు. కార్య‌క‌ర్త‌ల‌కు జీతాలు పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, బాల్య వివాహాల వల్ల కలిగే చట్టపరమైన పరిణామాల గురించి వివరించారు. ఇటువంటి వివాహాల‌ను చేసే త‌ల్లితండ్రుల‌తోపాటు వివాహం చేసే పురోహితులు, ఇత‌ర పెద్ద‌లు, చివ‌రికి క‌ల్యాణ మండ‌పం నిర్వాహ‌కులు కూడా శిక్షార్హులేనని పేర్కొన్నారు. పేద‌ల‌కు, ఇత‌ర అణ‌గారిన వ‌ర్గాల వారికి ఉచితంగా న్యాయం అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా కృషి జ‌రుగుతోంద‌ని చెప్పారు. అవ‌స‌ర‌మైన‌వారికి న్యాయ స‌హాయం, స‌హ‌కారం, స‌ల‌హాల కోసం టోల్ ఫ్రీ నెంబ‌రు 15100 ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని, దీనిని వినియోగించుకోవాల‌ని సూచించారు.

ఈ కార్యక్రమంలో సి.డబ్ల్యు.సి ఛైర్‌పర్సన్ జి. హిమబిందు, జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యం నాయుడు, ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.విమలారాణి, యూత్ క్లబ్ ఎన్జీవో జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ తదితరులు పాల్గొని ప్రసంగించారు. సిడిపివోలు, సూపర్వైజర్లు, కార్యాల‌య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *