అనకాపల్లి:
అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం గ్రామంలో అమలవుతున్న స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలించారు. గ్రామంలోని పారిశుధ్య కార్మికుడు మహాలక్ష్మి నాయుడుతో సీఎం మాట్లాడి, పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణ విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి సేకరించే విధానాన్ని పారిశుధ్య సిబ్బంది సీఎంకు వివరించారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల్లో వర్మీ కంపోస్టు తయారీ విధానం, సహజ ఎరువు ఉత్పత్తి, మార్కెటింగ్ ప్రక్రియలపై నిర్వాహకులు సమాచారం అందించారు.
స్వచ్ఛ ఆంధ్రా బ్రాండ్ అంబాసిడర్లకు ప్రశంసలు
పారిశుధ్య కార్మికులను స్వచ్ఛ ఆంధ్రా బ్రాండ్ అంబాసిడర్లుగా అభివర్ణించిన ముఖ్యమంత్రి, వారు నిర్వహిస్తున్న సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. స్వచ్ఛ రథాల ద్వారా వ్యర్థాల సేకరణ, ప్రతిఫలంగా గ్రామస్థులకు అందిస్తున్న సరకులను సీఎం స్వయంగా పరిశీలించారు.
గ్రామస్థులతో నేరుగా చర్చ
స్వచ్ఛ రథాలు గ్రామంలో ఎలా ఉపయోగపడుతున్నాయన్న అంశంపై సీఎం గ్రామస్థులతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తాళ్లపాలెం చెత్త నుంచి సంపద కేంద్రం, వర్మీ కంపోస్టు పిట్‌ను పరిశీలించి, వ్యవస్థ పనితీరును సమీక్షించారు.
వెస్ట్ టు ఎనర్జీపై ఆసక్తి
జిందాల్ వెస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నమూనాను పరిశీలించిన సీఎం, చెత్త సేకరణ నుంచి సంపద సృష్టి వరకూ మొత్తం వ్యవస్థ సమర్థంగా పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న సిబ్బంది, పారిశుధ్య కార్మికులను ముఖ్యమంత్రి అభినందించారు.
