Posted in

పది బోట్లు, రెండు టూరిజం స్థలాల ప్రారంభం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Minister kondapalli srinivas
Minister kondapalli srinivas

విజయనగరం, డిసెంబర్ 27:
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్‌లో పర్యాటకులకు కొత్త ఆకర్షణగా బోటు షికారు కార్యక్రమాలు శనివారం ప్రారంభమయ్యాయి. వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పది బోట్లు, రెండు టూరిజం స్థలాలను రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.

ఇప్పటికే తాటిపూడి రిజర్వాయర్‌లో కొనసాగుతున్న బోటు షికారు కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రెండో దశ పనులను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ దశలో 19 సీట్లతో కూడిన వాటర్ ట్యాక్సీ, ఆరు సీట్ల స్పీడ్ బోట్, 12 సీట్ల గల్ఫ్ బ్రిడ్జ్ బోట్, ఆరు సీట్ల వర్లాండో బోట్, రెండు సీట్ల ఓషన్ కయాక్ బోట్లు నాలుగు, రెండు సీట్లతో కూడిన వాటర్ రిక్షాలు రెండు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ప్రారంభోత్సవ అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని అన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం, ఉపాధి అవకాశాలు కల్పించే రంగాలలో పర్యాటక రంగం కీలకమైనదని పేర్కొన్నారు. తాటిపూడి రిజర్వాయర్‌లో బోటు షికారు ప్రారంభించడం ద్వారా పర్యాటకులకు ఆహ్లాదకరమైన వినోదం అందించడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.

జిల్లాలో పర్యాటకులను ఆకర్షించే ప్రధాన కేంద్రాల్లో తాటిపూడి రిజర్వాయర్ ఒకటిగా మారుతుందని, కుటుంబాలతో కలిసి సందర్శించి సహజసౌందర్యాన్ని ఆస్వాదించాలని మంత్రి పర్యాటకులను కోరారు.

ఈ కార్యక్రమంలో తాటిపూడి రిజర్వాయర్ సాగునీటి సంఘం అధ్యక్షుడు, పర్యాటక శాఖ అధికారులు, వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *