విజయనగరం, డిసెంబరు 16 ఃపర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ ఆదేశించారు. ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం, ఆ కమిటీ ఛైర్‌పర్సన్, జెసి సేధుమాధవన్ అధ్యక్షతన మంగళవారం తన ఛాంబర్‌లో జరిగింది. జిల్లాలోని మున్సిపల్ ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నాలుగు మున్సిపాల్టీల్లో తీసుకున్న చర్యలను కమిటీ కన్వీనర్, విజయనగరం కమిషనర్ పి.నల్లనయ్య వివరించారు.
ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు విస్తృతంగా తనిఖీలను నిర్వహించాలని ఆదేశించారు. మొదటిసారి జరిమానా విధించడంతోపాటు, వారికి అవగాహన కల్పించాలని సూచించారు. రెండో సారి కూడా దొరికితే జరిమానా భారీగా విధించాలని, అవసరమైతే ట్రేడ్ లైసెన్సు రద్దు లాంటి చర్యలను కూడా తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు తయారుచేస్తే, ఆ కంపెనీలపైనా చర్యలు తీసుకోవాలన్నారు. దాడులు చేసే అధికారుల బృందాలకు కూడా శిక్షణ ఇవ్వాలని చెప్పారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయ వస్తువులను అందుబాటులో ఉంచాలని, వీటిని తయారుచేసే కంపెనీలను రాయితీలను ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు. పర్యావరణ అనుకూల వస్తువుల వినియోగాన్ని పెంచేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని జెసి కోరారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు పి.నల్లనయ్య, ఎ.రామచంద్రరావు, ఎల్.రామలక్ష్మి, జనార్ధనరావు, పర్యావరణ ఇంజనీర్ సరిత, పరిశ్రమలశాఖ మేనేజర్, ఇతర శాఖల అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
