శృంగవరపుకోట, విజయనగరం జిల్లా:
శృంగవరపుకోట పట్టణం పెదఖండేపల్లి రోడ్డులో ప్రభుత్వ ఎలక్ట్రికల్ ఆఫీస్ పక్కనే ఉన్న సర్వే నం.138/4 భూసర్వే వివాదం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ అవసరాల కోసం రెవెన్యూ అధికారులు ఈ భూమిని ఎలక్ట్రికల్ శాఖకు అప్పగించగా, దాని కొంతభాగంలో విద్యుత్ సబ్‌స్టేషన్, అధికారుల భవనం నిర్మాణం పూర్తి చేశారు.
అయితే మిగిలిన చోట కొందరు వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఎలక్ట్రికల్ శాఖ అడ్డుకుంది. దీనిపై ఆక్రమణదారులు సర్వే నం.138/3 జిరాయితీ డాక్యుమెంట్ చూపిస్తూ కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో వ్యవహారం క్లిష్టమైంది. ప్రభుత్వ అధికారులు స్టేపై కోర్టులో పిటీషన్ వేసి ప్రస్తుతం కేసు న్యాయస్థానంలోనిదే.
ప్రభుత్వ భూమికి ఆనుకుని ఉన్న జిరాయితీ భూమి సర్వే నెంబర్లను ఆధారంగా తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు పలువురిని మోసగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు కొనుగోలు దారులు మోసపోయి దిక్కుతోచని పరిస్థితికి చేరారు. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యమే ఇలాంటి పరిస్థితులకు కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు.
