విశాఖపట్నం, సెప్టెంబర్ 09:రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అరకు కాఫీ షాప్‌లు ఏర్పాటు చేసి, గిరిజన ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని జీసీసీ అధికారులను రాష్ట్ర మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించారు.
అరకు కాఫీ బ్రాండ్‌కు ఇప్పటికే ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని, దానిని మరింత విస్తృతం చేయడానికి ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.బీచ్ రోడ్డులోని జీసీసీ కార్యాలయంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, ఎండీ కల్పనా కుమారి, డైరెక్టర్లు నాగరాజు, కనకరాజు, నిబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ —🔹 ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అరకు కాఫీ ఉత్పత్తుల దుకాణాలు ఏర్పాటు చేయాలని,
🔹 గిరిజన రైతుల సంక్షేమం కోసం అధికారులు వారితో మమేకమై సహకారం అందించాలని,
🔹 జీసీసీ కార్యకలాపాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు.అలాగే జీసీసీ ప్రాంగణంలో రూ.84 కోట్ల వ్యయంతో 12 అంతస్తుల భవనం నిర్మాణంపై చర్చ జరిపారు.
సిబ్బంది కొరత సమస్యను పరిష్కరించేందుకు కొత్త నియామకాలు చేపడతామని మంత్రి తెలిపారు.—బెర్రీ బోరర్ పురుగుపై ఆందోళన అవసరం లేదు: మంత్రిచింతపల్లి ప్రాంతంలోని కాఫీ తోటల్లో కనిపిస్తున్న బెర్రీ బోరర్ పురుగు వ్యాప్తిపై ఆందోళన అవసరం లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు.
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆమె సూచనలు:✅ ట్రాప్స్ ఏర్పాటు చేసి పురుగును పట్టుకోవాలి.✅ వేడి నీటితో చంపి భూమిలో పాతివేయాలి.✅ రైతుల నుంచి కాఫీ గింజలను జీసీసీ సరసమైన ధరకే కొనుగోలు చేయాలి.
ఇప్పటివరకు సుమారు 80 ఎకరాల్లో ఈ పురుగు ప్రభావం ఉన్నట్లు గుర్తించామని, నివారణ చర్యలు ప్రారంభించామని ఆమె మీడియాతో చెప్పారు.అదనంగా, మన్యం ప్రాంతాల అభివృద్ధి కోసం కేటాయించిన రూ.7,500 కోట్లలో ఇప్పటికే రూ.1,300 కోట్లు రహదారుల నిర్మాణానికి వినియోగించామని వెల్లడించారు.
జ్వరాల నియంత్రణకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, డోలీమోతల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.
అరకు కాఫీని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు 18 సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు.జీసీసీ
ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, జీసీసీ బలోపేతానికి, అలాగే బెర్రీ బోరర్ నివారణకు చేపడుతున్న చర్యలను వివరించారు.
