Posted in

కొత్త సంవత్సరంలోనైనా దీపం 2.0 పధకం సంక్రమంగా వెలుగుతుందా?

Deepam 2.0 Scheme
Deepam 2.0 Scheme

జన కమలం వార్త

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని లక్ష్యంగా తీసుకుని ప్రవేశపెట్టిన ‘దీపం 2.0’ ఉచిత గ్యాస్ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆశలు నింపింది. సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం ద్వారా వంటగ్యాస్ ఖర్చు భారం తగ్గించడమే కాకుండా, పొగ లేని వంటకు ప్రోత్సాహం ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపావళి సందర్భంగా అక్టోబర్ 31, 2024 న ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల మహిళలు ఈ పథకానికి అర్హులు. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున, ఏడాదికి మూడు సిలిండర్లు అందించేలా ప్రభుత్వం షెడ్యూల్ రూపొందించింది. లబ్ధిదారులు సిలిండర్ బుక్ చేసి, డబ్బు చెల్లించిన 48 గంటల్లోనే సబ్సిడీ మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ కావాలని నిబంధన పెట్టారు.

పథకం అమలు షెడ్యూల్ ఇలా ఉంది:

మొదటి సిలిండర్: అక్టోబర్ 29, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు

రెండో సిలిండర్: ఏప్రిల్ 2025 నుంచి జూలై 31, 2025 వరకు

మూడో సిలిండర్: ఆగస్టు 2025 నుంచి నవంబర్ 30, 2025 వరకు

ఈ పథకం వల్ల మహిళలకు ఆర్థిక ఉపశమనం కలగడంతో పాటు, కట్టెలు, చెరకు వాడకం తగ్గి ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వం చెబుతోంది.

అయితే, పథకం అమలులో సృష్టత లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదని, మరికొందరికి మొదటి సారి మాత్రమే సబ్సిడీ వచ్చి, రెండోసారి జమ కాలేదని వాపోతున్నారు. బ్యాంకు ఖాతా–ఆధార్ లింకింగ్, గ్యాస్ కనెక్షన్ వివరాల్లో తేడాలు, సాంకేతిక లోపాలే దీనికి కారణమని అధికారులు చెబుతున్నా, ప్రజల్లో మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతోంది.

కొత్త సంవత్సరంలోనైనా ‘దీపం 2.0’ పథకం సంక్రమంగా, పారదర్శకంగా అమలు చేయాలని, అర్హులైన ప్రతి మహిళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సబ్సిడీ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పథకం ఉద్దేశం మంచిదైనా, అమలులో లోపాలు సరిచేస్తేనే నిజమైన ప్రయోజనం చేకూరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *