విజయవాడ, జనవరి 5 (జన కమలం వార్త):
గోవా రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతి రాజు గారితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన అశోక్ గజపతి రాజును ముఖ్యమంత్రి తన అధికారిక నివాసానికి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలపై సీఎం చంద్రబాబు వివరించారు. ఉత్తరాంధ్ర రీజియన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందుకోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
భోగాపురంలో నిర్మించనున్న జీఎంఆర్ – మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యు సిటీకి అవసరమైన భూమిని అందించినందుకు గాను అశోక్ గజపతి రాజుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశం ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత ఊతం ఇవ్వనుందని, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే దిశగా కీలకంగా మారుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు.
అశోక్ గజపతి రాజుకు సీఎం చంద్రబాబు అభినందనలు
