Posted in

ఏపీ విద్యావ్యవస్థను దేశంలో నెం.1గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి నారా లోకేష్

Minister Nara Lokesh
Minister Nara Lokesh

విజయనగరం, ఆగస్టు 22: ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విజయనగరం దాసన్నపేట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మంత్రి.. విద్యారంగంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు పూర్తయ్యాయని, ఇకపై పూర్తిస్థాయిలో లెర్నింగ్ అవుట్‌కమ్స్, అభ్యసనా ఫలితాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇక నుంచి ప్రతి నెలా క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు హాజరై ఉపాధ్యాయుల క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకుంటానని తెలిపారు.

నూరుశాతం ఫలితాలే లక్ష్యం

విద్యారంగంలో చేపట్టిన సంస్కరణల కారణంగా గత ఏడాది మంచి ఫలితాలు వచ్చాయని, అయితే అవి తొలిమెట్టు మాత్రమేనని మంత్రి అన్నారు. ప్రతి పాఠశాలలో నూరుశాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు ఒత్తిడి లేకుండా వినూత్న పద్ధతుల్లో బోధన అందించాలని చెప్పారు.
యువగళం పాదయాత్ర సమయంలో విద్యారంగంలో ఎదురవుతున్న సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించానని నారా లోకేష్ తెలిపారు. ఉపాధి కోసం పిల్లాపాపలతో వలస వెళ్లే కుటుంబాలు, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వంటి అంశాలను చూసిన తర్వాత విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.

16 వేల టీచర్ పోస్టుల భర్తీ

విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని 10 వేల పాఠశాలల్లో వన్ క్లాస్–వన్ టీచర్ విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 3 వేల టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్, ఫిన్లాండ్‌కు పంపించి అక్కడి ఉత్తమ బోధనా విధానాలను అధ్యయనం చేయిస్తున్నామని తెలిపారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డే నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

విద్యార్థి కేంద్రంగా బోధన

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల ఆలోచనా విధానాన్ని ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాలని మంత్రి సూచించారు. క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్, అసెస్‌మెంట్, కరిక్యులమ్ మార్పులు, బెస్ట్ ప్రాక్టీసెస్ వంటి అంశాలపై క్లస్టర్ సమావేశాల్లో చర్చించాలని తెలిపారు.విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు క్రియేటివ్ క్లబ్, లీడర్‌షిప్ క్లబ్, లాంగ్వేజ్ క్లబ్, మ్యాథ్స్ అండ్ సైన్స్ క్లబ్, గ్రీన్ క్లబ్, స్పోర్ట్స్ క్లబ్, యాంటీ డ్రగ్స్ క్లబ్‌లను మరింత చురుగ్గా నిర్వహించాలని సూచించారు.

నైతిక విలువలకు ప్రాధాన్యం

మారుతున్న తరాల ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నారా లోకేష్ అన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ద్వారా విలువలతో కూడిన విద్యపై ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందిస్తున్నామని తెలిపారు.
తల్లిదండ్రులు, మహిళలను గౌరవించడం, సామాజిక బాధ్యత వంటి విలువలను చిన్నతనం నుంచే విద్యార్థులకు నేర్పాలని సూచించారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పద్ధతులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం

చేపట్టిన సంస్కరణల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే ఉపాధ్యాయులు లీప్ యాప్ ద్వారా తెలియజేయాలని, వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. గత రెండేళ్లుగా ఉపాధ్యాయులపై బోధనేతర పనిభారాన్ని తగ్గించామని, ప్రతి శుక్రవారం వారి సమస్యలను వింటున్నామని చెప్పారు.ఇకపై ప్రధానంగా విద్యార్థుల అభ్యసనా ఫలితాలపైనే దృష్టి పెట్టాలని సూచించారు. రాబోయే ఐదేళ్లలో దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ వైపు చూసేలా అత్యుత్తమ విద్యా విధానాన్ని రూపొందించేందుకు అందరూ కలసికట్టుగా పనిచేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు.ఈ సమావేశంలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *