(జన కమలం మ్యాగజైన్ స్టోరీ)
ఉత్తరాంధ్రలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ, భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆలయం శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి దేవాలయం. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ శైవ క్షేత్రం విజయనగరం జిల్లా శృంగవరపుకోట సమీపంలోని పుణ్యగిరి కొండల మధ్య ఆవిర్భవించి, వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకుని భక్తులను ఆకర్షిస్తోంది.
ప్రకృతి అందాలు, జలధారలు, పౌరాణిక విశ్వాసాలు కలగలిసిన ఈ దేవాలయం నేటికీ ఆధ్యాత్మిక శాంతికి ప్రతీకగా నిలుస్తోంది.పూర్వకాలంలో ఈ ప్రాంతం అరణ్యాలతో, ప్రశాంత వాతావరణంతో నిండిఉండేదని పౌరాణిక గాథలు చెబుతున్నాయి. ఋషులు, మహర్షులు ఈ పుణ్యగిరి ప్రాంతాన్ని తమ తపస్సులకు కేంద్రంగా ఎంచుకొని, పరమేశ్వరుని ధ్యానంలో లీనమయ్యేవారని కథనాలు ఉన్నాయి. వారి దీర్ఘ తపస్సులకు ప్రసన్నుడైన శివుడు లింగరూపంలో ఇక్కడ ఆవిర్భవించాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం అలా ఏర్పడిన ఈ శివలింగమే తరువాత కాలంలో ఉమాకోటిలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటోంది.
ఈ ఆలయానికి మహాభారత కాలంతో కూడిన చరిత్ర ఉందన్న విశ్వాసం కూడా ప్రజల్లో బలంగా ఉంది. మహాభారతంలో కీలక ఘట్టమైన పాండవుల అరణ్యవాసం, అజ్ఞాతవాసంతో ఈ ప్రాంతం అనుబంధమై ఉందని స్థానికులు చెబుతారు. జూదంలో కౌరవుల చేతిలో ఓడిపోయిన పాండవులు 13 ఏళ్ల అరణ్యవాసం అనంతరం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. ఆ అజ్ఞాతవాసాన్ని పాండవులు ఈ పుణ్యగిరి ప్రాంతంలోనే గడిపారని భక్తుల విశ్వాసం.పౌరాణిక గాథల ప్రకారం, అప్పట్లో ఈ ప్రాంతంలో విరాట్రాజు కొలువు ఉండేదని చెబుతారు. విరాట్రాజు రాజసభలోనే పాండవులు వివిధ వేషాలలో అజ్ఞాతవాసం గడిపారని పురాణ కథనాలు తెలియజేస్తున్నాయి. ఆ సమయంలో పాండవులు ప్రతి రోజు ఈ పుణ్యగిరిలోని జలధారల్లో స్నానమాచరించి, పరమేశ్వరుని భక్తితో ఆరాధించేవారని భక్తుల నమ్మకం. అందుకే ఈ క్షేత్రం పాండవుల పుణ్యస్మృతులకు ప్రతీకగా నిలిచిపోయింది.
ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది కోటి లింగాల రేవు. కొండల మధ్య సహజంగా ఏర్పడిన ఈ ప్రాంతంలో అనేక శివలింగాలు దర్శనమిస్తాయి. వీటి మీదుగా ఎత్తునుంచి పవిత్ర జలబిందువులు నిరంతరం పడుతుంటాయి. ఈ దృశ్యం భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది. ప్రకృతి స్వయంగా అభిషేకం చేస్తున్నట్లుగా అనిపించే ఈ అనుభూతి భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక తృప్తిని కలిగిస్తుంది.కొండపైకి చేరుకున్న తరువాత పుట్టధార దర్శనమిస్తుంది. ఈ ధార నుంచి వచ్చే నీరు గర్భగుడిలోని శివలింగాలను తాకుతూ ప్రవహించడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ నీరు అత్యంత పవిత్రమని, దీనిలో తలస్నానం చేస్తే పాపాలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
ముఖ్యంగా మహాశివరాత్రి రోజున ఈ జలధారల కింద స్నానం చేసి పరమేశ్వరుని దర్శించుకోవడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయన్న నమ్మకం బలంగా ఉంది.ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా శివరాత్రి రోజు, అలాగే మరుసటి రోజు ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అంచనాల ప్రకారం ఈ మూడు రోజుల్లో లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.
మహాశివరాత్రి రోజు రాత్రంతా జాగరణ చేసి, పరమేశ్వరుని నామస్మరణతో గడిపితే కైలాస ప్రాప్తి లభిస్తుందన్న విశ్వాసం భక్తుల్లో ఉంది. అందుకే చలి, అలసటను లెక్కచేయకుండా భక్తులు రాత్రంతా ఆలయ ప్రాంగణంలోనే ఉండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. శివనామస్మరణతో మారుమోగే పుణ్యగిరి ఆ సమయంలో ఒక దివ్యలోకంలా మారిపోతుంది.కాలక్రమేణా ఈ ఆలయం అభివృద్ధి చెందుతూ, నేడు సకల సౌకర్యాలతో భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
భక్తుల సౌకర్యార్థం తాగునీరు, విశ్రాంతి ప్రదేశాలు, దర్శన ఏర్పాట్లు మెరుగుపరచబడ్డాయి. పర్యావరణాన్ని కాపాడుతూ ఆలయ వైభవాన్ని నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.రవాణా సౌకర్యాల పరంగా కూడా ఈ దేవాలయం అందుబాటులో ఉంది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి శృంగవరపుకోట వరకు బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి ఆటోల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి భక్తులకు మరింత సౌకర్యం కల్పిస్తోంది.
ఆధ్యాత్మిక విశ్వాసం, పౌరాణిక చరిత్ర, ప్రకృతి అందాలు కలిసిన ఈ ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయం ఉత్తరాంధ్ర శైవ సంప్రదాయానికి చిరస్థాయిగా నిలిచిపోయింది. తరతరాలుగా భక్తులు ఇక్కడికి వచ్చి తమ మనసు నిండా భక్తితో, విశ్వాసంతో పరమేశ్వరుని దర్శించుకుంటున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన ఈ పుణ్యగిరి క్షేత్రం రాబోయే తరాలకు కూడా ఆధ్యాత్మిక ప్రేరణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
