Posted in

నకిలీ ఏసీబీ కాల్స్‌పై హెచ్చరిక – ఏసీబీ డీజీ

Fake ACB Calls
Fake ACB Calls

విజయనగరం, డిసెంబరు 30:కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తమను తాము అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులుగా పరిచయం చేసుకుని ప్రభుత్వ అధికారులకు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులు చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఏసీబీ ప్రధాన కార్యాలయం గుర్తించినట్లు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇటీవల కాలంలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసి “నేను ఏసీబీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాను. మీపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. త్వరలో మీపై ఏసీబీ రైడ్ జరగనుంది. ఆ రైడ్ ఆపాలంటే వెంటనే చెప్పిన నంబర్‌కు డబ్బులు పంపాలి లేదా మా వ్యక్తికి నగదు ఇవ్వాలి” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. కొన్నిసార్లు “మీపై ఏసీబీ కేసు నమోదు అయింది. అరెస్టు కాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలి” అంటూ భయపెడుతున్న ఘటనలు తమ దృష్టికి వచ్చినట్లు వివరించారు.ఏసీబీ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ ద్వారా డబ్బులు అడగరని డీజీ స్పష్టంగా తెలియజేశారు.

శాఖ పేరుతో వచ్చే ఇటువంటి నకిలీ, మోసపూరిత కాల్స్‌కు ప్రభుత్వ అధికారులు ఎవరూ స్పందించవద్దని సూచించారు.ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చినట్లయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో పాటు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రభుత్వ అధికారులు ఇటువంటి నకిలీ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *