విజయనగరం, జనవరి 01 : రహదారిపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి కోరారు. గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ప్రారంభించి, గోడ పత్రికలను, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రహదారిపై జాగ్రత్తగా వాహనాన్ని నడపడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని, జరుగుతున్న ప్రమాదాలలో 90 శాతం నిబంధనలు పాటించకపోవడం వల్లే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు తమ కుటుంబాలను, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచించారు.
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జనవరి 01 నుంచి నుండి 31 వరకు జరుగుతాయని, ఈ నెల రోజుల పాటు రహదారి భద్రతా నియమాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ వర్గాల ప్రజలకు, వాహన చోదకులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ డి. మణి కుమార్, మోటారు వాహన తనిఖీ అధికారులు మురళీకృష్ణ, దుర్గ ప్రసాద్, శశి కుమార్, రవి శంకర్ ప్రసాద్, వెంకట రావు, శివ రామ గోపాల్, రమేష్ కుమార్, ఉష, శ్రావ్య, ఐశ్వర్యలక్ష్మి, నవీన్ మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
