విజయనగరం, జనవరి 09 (జన కమలం):
ఒక జిల్లా – ఒక ఉత్పత్తి (ODOP) కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా నుంచి మామిడి తాండ్రను ప్రత్యేక ఉత్పత్తిగా ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి వెల్లడించారు. మామిడి తాండ్రకు దేశవ్యాప్తం నుంచి అంతర్జాతీయ మార్కెట్ల వరకూ గుర్తింపు తీసుకువెళ్లే దిశగా సమగ్ర అభివృద్ధి, విస్తరణ ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎల్.కోట మండలం భీమాలి ప్రాంతంలో తయారయ్యే మామిడి తాండ్ర ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఏటా సుమారు 500 మెట్రిక్ టన్నుల మామిడి తాండ్ర ఉత్పత్తి జరుగుతుండగా, ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లే వారు తమ బంధువులు, ప్రముఖులకు భీమాలి మామిడి తాండ్రను బహూకరించడం ఆనవాయితీగా మారిందన్నారు.
ఈ ఖ్యాతిని మరింత విస్తరించి, రైతులు, తయారీదారులు, మహిళా సంఘాలకు ఆర్థిక బలం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మామిడి తాండ్ర తయారీ, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ రంగాల్లో ఆధునిక సాంకేతికతను జోడించి ప్రత్యేక బ్రాండ్‌గా అభివృద్ధి చేయాలన్నారు.
ఈ మేరకు శుక్రవారం తన ఛాంబర్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు. పరిశుభ్రమైన వాతావరణంలో, ఆధునిక పద్ధతుల్లో మామిడి తాండ్ర తయారీ, నిల్వపై దృష్టి పెట్టాలని చెప్పారు. సోలార్ డ్రైయర్స్, కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు, ప్రత్యేక ప్యాకేజింగ్‌తో పాటు ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా విక్రయాలు చేపట్టాలని ఆదేశించారు.
ఇప్పటికే ఎల్.కోటలో ఉన్న ఎఫ్‌పిఓను పునరుజ్జీవింపజేయడం, మూతపడ్డ కోల్డ్ స్టోరేజీని తిరిగి ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా మామిడి తాండ్ర ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కొత్తగా ఒక ఎస్పివి (స్పెషల్ పర్పస్ వెహికల్) ఏర్పాటు చేసి, స్థానిక భాగస్వాములను చేర్చాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధుమాధవన్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస పాణి, ఉద్యాన శాఖ డీడీ చిట్టిబాబు, మెప్మా పీడీ చిట్టిరాజు, చేనేత జౌళి శాఖ ఏడీ మురళీకృష్ణ, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ ఎం. లక్ష్మణరావు, పరిశ్రమల శాఖ జీఎం ఎం.వి. కరుణాకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
మామిడి తాండ్ర అభివృద్ధి, విస్తరణకు జిల్లా కలెక్టర్ సమగ్ర కార్యాచరణ..
