విజయనగరం, మార్చి 18: రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం మరియు వారి సామాజిక, ఆర్థిక ఎదుగుదల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర ఎం ఎస్ ఎం ఇ, సెర్ఫ్, ఎన్ ఆర్ ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
బుధవారం ఉదయం స్థానిక ఆర్. టి. సి. డిపో ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో “దివ్యాంగ శక్తి” పథకాన్ని రాష్ట్ర ఎం. ఎస్. ఎం. ఇ., సెర్ఫ్, ఎన్.ఆర్.ఐ. సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించి, బస్సులో ప్రయాణించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించి, దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించడం వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
దివ్యాంగుల కోసం గతంలో ఉన్న రాయితీలను పెంచుతూ, ఇప్పుడు ఐదు రకాల బస్సుల్లో (పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ మరియు సిటీ బస్సుల్లో) 100% ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇది మొత్తం బస్సు సర్వీసుల్లో సుమారు 77% వరకు ఉంటుందన్నారు. అంతేకాకుండా ఏసీ మరియు ప్రీమియం బస్సుల్లో ప్రయాణించే దివ్యాంగులకు 50% రాయితీ కొనసాగుతుందని తెలిపారు. దివ్యాంగుల సహాయార్థం వచ్చే వారికి కూడా నిబంధనల మేరకు అన్ని రకాల బస్సుల్లో 50% రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగుల ఆర్థిక భరోసా కోసం పెన్షన్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం గణనీయంగా పెంచిందని మూడువేల రూపాయలు గల పెన్షన్ ఆరు వేల రూపాయలకు పెంచడం జరిగిందని తెలిపారు. క్రీడల్లో రాణించే దివ్యాంగుల కోసం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చి, వారిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. జిల్లాలో సుమారు 30,000 మంది దివ్యాంగులు ఉండగా, ప్రస్తుతం 1,200 మంది మాత్రమే బస్సు పాస్‌లు కలిగి ఉన్నారని, మిగిలిన వారందరూ సదరం సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డు ద్వారా ఆర్టీసీ కాంప్లెక్స్‌లలో పాస్‌లు పొందాలని సూచించారు.
మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ పథకం ఎంత విజయవంతమైందో, అదే స్ఫూర్తితో ‘దివ్యాంగ శక్తి’ కూడా దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. బస్సులలో దివ్యాంగులకు కేటాయించిన సీట్లు వారికి అందుబాటులో ఉండేలా సిబ్బంది, ప్రజలు సహకారాన్ని అందించాలని కోరారు.
జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ మాట్లాడుతూ దివ్యాంగులకు పరిస్థితుల రీత్యా వారి లక్ష్యాలను చేరుకొనుటకు అదనపు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే వారి సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, వారి అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందిస్తుందని, ప్రతి ఒక్కరూ వాటిని వినియోగించుకోవాలని కోరారు. ప్రస్తుతం 50% అంగవైకల్యం కలవారికి మాత్రమే బస్సు పాసు సౌకర్యం వర్తిస్తుందని, దానిని 40 శాతానికి తగ్గించడం ద్వారా ఎక్కువ మందికి ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం వచ్చింది అన్నారు.
స్థానిక శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతి రాజు మాట్లాడుతూ దివ్యాంగులకు దేశంలోనే అత్యధిక మొత్తం పెన్షన్ అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. దివ్యాంగులకు ఆర్దిక భరోసా కల్పించడమే కాకుండా వారికి విద్యా ఉపాధి రంగాల్లో అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారన్నారు. అవసరమైన వారికి బస్సు పాసులు అందించే ఉద్దేశంతో మూడు రోజులపాటు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని దివ్యాంగులు అందరూ వినియోగించుకోవాలని తెలిపారు.
జిల్లా ప్రజా రవాణా అధికారిణి జి. వరలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 1200 మంది దివ్యాంగులు బస్సు పాసులు కలిగి ఉన్నారని, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం 40 శాతం వైకల్యం కలిగిన వారికి కూడా కల్పిస్తున్నందున మరింత ఎక్కువ మందికి ఈ పథకం ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అర్హులైన దివ్యాంగులు అందరూ బస్సు పాసులు పొందాలని, బస్సు పాసు మూడు సంవత్సరాల గడువుతో అందజేయడం జరుగుతుందని తెలిపారు. బస్సులలో దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో వారు కూర్చొనేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
అనంతరం దివ్యాంగులకు బస్సు పాసులు అందించారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం పట్ల దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్ పర్సన్ పి. యశస్వి, జిల్లా పరిషత్ సీఈవో బి. వి. సత్యనారాయణ, దివ్యాంగుల సంక్షేమ అధికారి వెంకటేశ్వరరావు , మెప్మా పిడి చిట్టి రాజు, డిపో మేనేజర్ శ్రీనివాస్, డిప్యూటీ సిటి ఎం సత్యనారాయణ, ఇతర అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
