రేగిడి ఆమదాలవలస, (విజయనగరం), అక్టోబర్ 03 :
భారీ వర్షాల నేపధ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. నాగావళి నదీ పరీవాహక ప్రాంతంలో ఆయన శుక్రవారం సుడిగాలి పర్యటన జరిపారు. రేగిడి ఆమదాలవలస మండలం బొడ్డవలస గ్రామం వద్ద నాగావళి నది నీటి ప్రవాహ ఉధృతిని పరిశీలించారు. దిగువకు నీటి ప్రవాహం, దిగువనున్న గ్రామాలు, పంటల స్థితిగతులపై రెవెన్యూ అధికారులను ఆరా తీశారు. నదిని ఆనుకొని ఉన్న త్రాగునీటి పథకాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒడిశాలో భారీ వర్షాల కారణంగా నాగావళి, వంశధార నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉందని అన్నారు. అలాగే జిల్లాలో కూడా గత రెండు రోజులుగా భారీ వర్షాలు పడ్డాయని, ఇంకా కురిసే అవకాశం ఉందని చెప్పారు. అందువల్ల నదులు, వాగుల్లో నీటి ప్రవాహాన్ని నిరంతరం గమనిస్తూ ఉండాలని ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో మరింత అప్రత్తమత్త అవసరమని అన్నారు. ప్రవాహం ఉధృతంగా ఉన్న కారణంగా నదుల్లో ఎవరూ దిగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని, పారిశుద్యంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ పర్యటనలో చీపురుపల్లి ఇన్చార్జి ఆర్డీవో ఆశయ్య, తహసీల్దార్ కృష్ణలత ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
